Tuesday, November 18, 2008

వెలుగురేఖ

భవిష్యత్తు అంతా వెలుగు రేఖ కనిపించని చీకటిలా అనిపించినపుడు,

కనిపించే మిణుగురు పురుగులతో కాసేపు ఆడుకోవడంలో తప్పు లేదు...

ఏమో...ఎవరికి తెలుసు...మిణుకు మిణుకుమనే మిణుగురుల గుంపే,

జీవితం లో వెలుగునింపి భవిష్యత్తుకి దారి చూపుతాయేమో

Sunday, October 26, 2008

పల్లకిలో పెళ్ళికూతురు...!

అంగరంగ వైభవంగా
అత్తవారింట అడుగుపెట్టు తరుణమది...

తనదయిన నవ జీవితం లోకి
ఆశగా అడుగుపెట్టు వధువుకు
జీవితపు వడి దుడుకులకు
తోలి మజిలీ నేనే అంటోంది ఆ పల్లకి!

పుట్టినింట పుత్తడిబొమ్మకి
మెట్టినింటికి దారి పరచి
కడ దాకా రాలేనన్న సంగతి మరచి
మురిపెంగా నేనున్నా అంటోంది ఆ పల్లకి!

కంటి పాపలా పెంచిన వారు
కంటికోనలు దాటిపోతుంటే
కనులెదుట మనువాడినవాడుండగా
కంటికొలనులో కన్నీరెందుకే అంటోంది ఆ పల్లకి!

మది నిండా మమకారపు ఆలోచనలు సుడిగుండాలయి
యెడ నిండా ఏలుకునే వాడిపై ఏకాగ్రత కుదరక
బరువెక్కిన హృదయముతో భారంగా కూర్చున్న వధువు
భారం కాసేపయినా మోయనివ్వమని ముందుకు కదిలిందా పల్లకి!!!

పయనం - గమ్యం

నీ గమ్యం మారిందని విన్నా
మరి నీ పయనమెందుకు ఆగిందని కలవరపడుతున్నా...

కోటి వేణువుల పుట్టిల్లు
వెదురు సైతం చిగురు తొడిగి, పూత పూస్తే...
ఎందుకో మరి కన్ను మూస్తుందట ...
వసంతమే వెదురుకు ఎదురు తిరిగిందని, బాధ పడుతున్నా..

మెడ నిండా వంపులతో
వడినిండా కంకుల సొంపులతో
గాలి పాటకి నాట్యమాడే
కోతకొచ్చిన వరి పైరు ...
వేయి తలలు తెగి వెర్రెక్కి చూస్తోంది ...
అయినా... మంచి చేయని రైతుని
అందలం ఎక్కించి ఆకలి తీరుస్తోంది...
మనిషికాకలేసి కోతకొస్తే...
మూగబోయిన పైరు మోడుబారిందని బాధపడుతున్నా...

ఇంత తెలిసి నీ గమ్యమెందుకు మారింది ...
మారినా ...నీ పయనమెందుకు ఆగింది ??

కేటాయింపులు ...!

ఎక్కడికేల్తోంది ...దేశం యేమయిపోతోంది??
హిమశైల శిఖరం పైకా?
పాతాల కుహరం లోకా??

అని ఒక మహాకవి భవిష్యత్తుని ఊహించి రాస్తే,
రాసినపుడు నవ నాగరిక సమాజం నోరు మూసుకుంది,
న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టింది...

మరి ఇప్పుడు ?

కులమొద్దు , మతమొద్దు అని
కలం పట్టిన కోటి చేతులు
కిలమేక్కిన కసాయిలతో పోరాడుతుంటే ...
సమాజం లో సమ్మనత్వం కావాలన్తుంటే...

కత్తి కన్నా కలం గొప్పదని,
నీతులు చెప్పే ముతక బట్టల
నేతలు, వాతలు పెడుతుంటే...
భారత యువత, మరిగిపోదా?

మనకెందుకని ఊరుకోక మందికోసం,
పదిమందికోసం...మండుతున్న కాగడాలయ్యారు...
రాజకీయ వందిమాగధులు పందికోక్కు లయి
ఆ వెలుగులలో విందారగిస్తున్నారు ...

కేటాయింపులొద్దు అంటే లాటి దెబ్బలా?
బైటాయించినందుకు బాష్పవాయువులా??

ప్రవాసమా...ఇది వనవాసమా ??

వీధి దాటి, వాడ దాటి,
ఊరుదాటి , యేరు దాటి,
దేశం దాటి,
సప్తసముద్రాలను సైతం దాటాం...
శాపగ్రస్తుల్లా బ్రతుకీడుస్తున్నాం.

మాతృ దేశముని వదిలి
కన్నవాళ్ళని వదిలి
మిత్రులను వదిలి
కడలి దాటాం...కష్టాల కడలీదుతున్నాం.

జగమెరిగిన దేశం మనదని గర్విస్తాం,
మరి , ఇంత తెలిసి వలసలెందుకు వస్తున్నాం.

మనదేశం చేసిన పాపమా..
కాలచక్రపు కలికాలమా...
తల్లి భారతి మూగ రోదనమా..
ప్రవాసమా... ఇది వనవాసమా!!!

కాలం చేసిన మోసం

కాలం మారింది,
అని వేయి కళ్ళ నెమలి పూరి విప్పి నాట్యమాడింది

కాలం మారింది,
అని కొమ్మ చాటు కోయిలమ్మ గొంతు విప్పింది

కాలం మారింది,
మరిమనసు మారదేం?

రాలిపడిన పువ్వులను చూస్తూ,
పండి రాలిన ఎండుటాకులను చూస్తూ,
యెదలో రేగే సుడిగుండాలను తీరమెందుకు తాకనిచ్చింది?
అంధకారంలో ఉంటూ ఆసృవుల అసువులెందుకు విడిచింది?

పాపం మనసు...
కొత్త రెమ్మల మీద కోయిలమ్మని చూచి
ఉత్త ప్రేమలు చేసిన గాయాన్ని తలచి
ఎక్కిపెట్టి ఏడ్చింది ...
మూగ భావాలను తొక్కి పెట్టి ఉంచింది!

కాలం మారిందని
కోయిల గానం ఆపిందా??
నెమలి నాట్యం ఆగిందా??
మరి మనసు ఎందుకిలా బాధలో మునిగింది??
ఎందుకిలా ఒంటరిగా రోదిస్తోంది?

వసంతం కోసం ఎదురుచూసే కోయలేగా మనసు,
వర్షం కోసం చూసే చక్రవాకమేగా మనసు,
అన్ని తెలిసి మనిషికి ఎందుకు మనసంటే అంత అలుసు ...?

కాలం చేసిన మోసాన్నే తలచుకుంటూ...,
అయినా...
కాలానికేం తెలుసు మనిషి బాధ...?
మనిషికేం తెలుసు మనసు బాధ...??



Saturday, October 25, 2008

నా స్వప్నసుందరి!

పొడుగాటి జడతో బాపు బొమ్మలా...
నడుము వంపులతో నండూరి ఎంకిలా...
కిల కిల పలుకులతో కృష్ణశాస్త్రి కవితలా...
గలగల నవ్వులతో గోదావరి పరవళ్ళలా ...